LATEST NEWS

ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడటంలో CPR & First Aid కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

By SUNCHU SURESH • 2026-04-17 18:39 • 3 views   Share WhatsApp Share Facebook Share X
ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడటంలో CPR & First Aid కీలకం: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

జగిత్యాల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “Arrive Alive” అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఫస్ట్ రెస్పాండర్స్‌కు CPR మరియు First Aid శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన రహదారుల పరిసరాల్లో ఉన్న దుకాణాలు, హోటళ్లు, పంక్చర్ షాపులు, పెట్రోల్ బంకులు నిర్వహించే వ్యక్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ Ashok Kumar మాట్లాడుతూ, ప్రమాదాల సమయంలో తక్షణ ప్రథమ చికిత్స అందక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత మొదటి గంటను “గోల్డెన్ అవర్”గా పరిగణిస్తారని, ఈ సమయంలో సరైన సహాయం అందిస్తే ప్రాణాలను రక్షించే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

సోషల్ మీడియా ద్వారా సరైన అవగాహన లేకుండా CPR లేదా ప్రథమ చికిత్స చేయడం ప్రమాదకరమని, అందుకే శాస్త్రీయ పద్ధతుల్లో శిక్షణ అందించడం అవసరమని చెప్పారు. జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇటువంటి శిక్షణ కార్యక్రమాలను విస్తరించనున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసిన వ్యక్తులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “రహ్ వీర్” పథకం కింద ఆర్థిక ప్రోత్సాహకాలు అందించబడతాయని అధికారులు తెలిపారు. అలాగే, గుడ్ సమారిటన్ చట్టం ప్రకారం సహాయం చేసిన వారికి చట్టపరమైన ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో వైద్య నిపుణులు వివిధ అత్యవసర పరిస్థితుల్లో అందించాల్సిన ప్రథమ చికిత్సపై ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు.