LATEST NEWS

కిస్తారెడ్డిపేట చౌరస్తాలో వాహన తనిఖీలో ఆటో దొంగ పట్టివేత

By SUNCHU SURESH • 2026-04-23 10:59 • 3 views   Share WhatsApp Share Facebook Share X
కిస్తారెడ్డిపేట చౌరస్తాలో వాహన తనిఖీలో ఆటో దొంగ పట్టివేత

అమీన్పూర్, ఏప్రిల్ 22 (పిడికిలి): బుధవారం కిస్తారెడ్డిపేట చౌరస్తా వద్ద పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో నంబర్ ప్లేట్ లేకుండా అనుమానాస్పదంగా వచ్చిన ఒక ఆటోను ఆపారు. ఆ సమయంలో ఆటోలో ఉన్న వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా, పోలీసులు వెంటనే వెంబడించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో అతను తన పేరు హిమాన్షు యాదవ్ (తండ్రి: మోహన్ యాదవ్, వయసు: 22 సంవత్సరాలు) అని తెలిపాడు. ప్రస్తుతం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ విగ్రహం సమీపంలోని సండే మార్కెట్ రోడ్ వద్ద నివసిస్తున్నట్లు చెప్పాడు. అతను బీహార్ రాష్ట్రంలోని బక్సర్ జిల్లా పరిధిలోని పరాసియా గ్రామానికి చెందినవాడని వెల్లడించాడు.

పోలీసుల ప్రకారం, 21.03.2026న అమీన్‌పూర్ ప్రాంతంలో ఒక ఇంటి వద్ద నిలిపి ఉంచిన బజాజ్ సిఎన్‌జీ ఆటోను దొంగిలించినట్లు విచారణలో ఒప్పుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆ ఆటోను తన నివాసంలో దాచిపెట్టి, నంబర్ ప్లేట్ తొలగించి అమ్మడానికి తీసుకెళ్తున్న సమయంలో వాహన తనిఖీలో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడి వద్ద నుంచి బజాజ్ సిఎన్‌జీ (ఈకో గ్రీన్ రంగు) ఆటో (నంబరు: TG 34 T 4937)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిపై గతంలో కూడా పలు దొంగతనం కేసులు నమోదై ఉన్నట్లు సమాచారం.

నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.